Type Here to Get Search Results !

రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన సచివాలయ ఉద్యోగుల నిరసనలు.. బోసిపోయిన కార్యాలయాలు..

వెల్లువెత్తిన సచివాలయ ఉద్యోగుల నిరసనలు.. బోసిపోయిన కార్యాలయాలు..
Jan 10,2022 13:46



అమరావతి : గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ... ఎపిలోని అన్ని జిల్లాల్లోనూ సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. నిరసన ర్యాలీలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో.. అన్ని సచివాలయాలు బోసిపోయాయి.

కర్నూలు : గడివేముల మండలంలోని ఎంపిడిఓ కార్యాలయం దగ్గర గ్రామ సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆదోని పట్టణంలో వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి మున్సిపల్‌ కార్యాలయం నుండి ఎంపీడీఓ, ఆర్డీవో కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ప్రొబెషన్‌ డిక్లరేషన్‌ చేయాలని పిఆర్‌సి వర్తింపజేయాలని ఉద్యోగ సంఘం నాయకులు రవికుమార్‌ పద్మ, తిరుమలేష్‌, డిమాండ్‌ చేశారు. నందికొట్కూరు పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం నుండి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. తహసీల్దార్‌ రాజశేఖర్‌బాబుకు సచివాలయ ఉద్యోగులు వినతిపత్రాన్ని అందజేశారు. పత్తికొండ తహసీల్దార్‌ కార్యాలయం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన చేశారు. పత్తికొండ తహసీల్దార్‌ విష్ణు ప్రసాద్‌ కు ఎంపిడిఒ పార్థసారథి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. పాములపాడు ఎంపిడిఓ కార్యాలయం ఎదుట సచివాలయ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఆస్పరి మండలంలోని తహసీల్దార్‌, మండల పరిషత్‌ కార్యాలయం ముందు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసన తెలిపి అనంతరం తహసీల్దార్‌ నిత్యానంద రాజు, ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్‌ కు వినతిపత్రం అందజేశారు.


కడప : చాపాడులో సచివాలయ సిబ్బంది నల్లబ్యాడ్జీలను ధరించి విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. వైద్యాధికారి మంజులకు వినతిపత్రాన్ని అందించారు. వేంపల్లె ఎంపిడిఓ కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. రాజంపేట లోని ఎంపిడిఒ బాలముని స్వామి కి వినతిపత్రాన్ని అందించారు. పోరుమామిళ్ల ఎంపీడీఓ కార్యాలయం ముందు సచివాలయ సిబ్బంది నిరసన తెలిపారు. వల్లూరు మండల పరిషత్‌ కార్యాలయంలో అన్ని గ్రామ సచివాలయ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ఎంపిడిఓ జుబేదా బేగం కు వినతిపత్రాన్ని అందజేశారు. పెనగలురులో గ్రామ సచివాలయ సిబ్బంది రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. మైలవరం మండలంలోని గ్రామ పంచాయితీ సచివాలయం ఉద్యోగులు జెఎసి తరుపున ఆర్డీఓ కి వినతిపత్రం సమర్పించారు.


తిరుపతి : సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలని కమిషనర్‌కు సచివాలయ ఉద్యోగులు వినతిపత్రాన్నిచ్చారు. ఏర్పేడు మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్‌ కార్యాలయం ఎదుట సచివాలయ ఉద్యోగులు నిరసన చేపట్టారు. వడమాలపేట మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం ఎదుట 12 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వి కోట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బైరెడ్డిపల్లి మండలంలోని సచివాలయ సిబ్బంది ఆందోళన చేశారు.




కృష్ణా : విజయవాడలో సచివాలయ ఉద్యోగులు నిరసన చేపట్టారు. పెడనలో, కంచికచర్ల తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బంటుమిల్లి మండలంలోనూ, విస్సన్నపేటలో సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.


అనంతపురం : బుక్కరాయసముద్రములో తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సచివాలయ ఉద్యోగులు నిరసన చేపట్టారు. రాయదుర్గంలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. సోమందేపల్లి మండలం, కనగానపల్లి, రాయదుర్గం మండలం, ఓబులదేవరచెరువు, అనంతపురం జిల్లా పెనుకొండ తాలూకా, రొద్దం మండలం, పెద్దపప్పూరు, రాప్తాడు, ఉరవకొండ, సింగనమల, చిలమత్తూరు, పుట్లూరు, విడపనకల్లు, అమాడగురులలో నిరసనలు వెల్లువెత్తాయి.

విజయనగరం : మెరక ముడిదాం మండలం, మెంటాడ మండలం, సాలూరు మండలం, జియ్యమ్మవలస మండలం, కురుపాంలలో సచివాలయ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.


గుంటూరు : గుంటూరు జిల్లా, నిజాంపట్నం, నాదెండ్ల మండలం, భట్టిప్రోలు, సత్తెనపల్లిలో సచివాలయ ఉద్యోగులు నిరసన ర్యాలీలు చేపట్టారు.




శ్రీకాకుళం : ఇచ్ఛాపురం, సీతంపేట మండలం, పాలకొండ రూరల్‌, వీరఘట్టం మండల కేంద్రంలోనూ సచివాలయ ఉద్యోగులు నిరసనలు తెలిపి వినతిపత్రాలను అందజేశారు.


ప్రకాశం : మార్టూరు రూరల్‌, కందుకూరు, యర్రగొండపాలెం మండలం, గుడ్లూరు, సంతమాగులూరు, టంగుటూరు, కొండపి, సింగరాయకొండ, మార్కాపురం, కొత్తపట్నం, వెలిగండ్ల, కందుకూర్‌లలో సచివాలయ ఉద్యోగుల నిరసనలు వెల్లువెత్తాయి.


పశ్చిమ గోదావరి : భీమవరం, పోడూరు, పెనుగొండ, గణపవరం మండలం, పెనుమంట్ర మండలం, తణుకు, కొయ్యలగూడెం, ఆచంటలో సచివాలయ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలను అందజేశారు.


విశాఖ : విశాఖలోనూ సచివాలయ ఉద్యోగులు నిరసన ర్యాలీలు నిర్వహించారు.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.